కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంకెలతో నిండిన ఆ బడ్జెట్‌లో దేశంలో సామాన్య ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుంది?అని సందేహం కలగడం సహజం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
పదవీ విరమణ చేసినవారు, వృద్ధులు తమ కష్టార్జితాన్ని బ్యాంకులలో ఫిక్స్ డిపాజిట్ చేసుకొని దానిపై వచ్చే వడ్డీని ఖర్చుల కోసం వినియోగించుకుంటారు. ఆ వడ్డీపై ఇదివరకు రూ.50,000 వరకు పన్ను రాయితీ ఉండేది. దానిని ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచింది. అంటే ఏడాదికి లక్ష రూపాయల వరకు వడ్డీ తీసుకున్నా పన్ను చెల్లించనవసరం లేదన్న మాట!
అదేవిదంగా అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై ఇదివరకు రూ.2.4 లక్షల వరకు రాయితీ ఉండేది. దానిని ఇప్పుడు రూ.6 లక్షలకు పెంచారు.
దేశవ్యాప్తంగా 50,000 ప్రభుత్వ పాఠశాలలో ఇకపై డిజిటల్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయబోతోంది. దీనికోసం బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుంది.
దేశవ్యాప్తంగా స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల ఉత్పత్తులు ప్రజలకు చేర్చుతున్న‘గిగ్ ఉద్యోగులు’ (అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారు) వివరాలు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, ఆరోగ్య భీమా సదుపాయం కల్పించబడుతుంది.
దేశంలో పప్పు ధాన్యాలు ఉత్పత్తిని పెంచేందుకు ఆరు సంవత్సరాల ప్రణాళికతో ప్రయోగాత్మకంగా 10 జిల్లాలలో ‘పీఎం ధన్ ధాన్య యోజన’ అనే పధకం అమలుచేస్తారు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులతో సహా 36 ప్రాణ రక్షక మందులపై సుంకాలు తగ్గించడం వలన ఆయా మందుల ధరలు తగ్గబోతున్నాయి.