నేను కొడితే గట్టిగానే కొడతాను: కేసీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్‌హౌస్‌లోనే కాలక్షేపం చేస్తున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మళ్ళీ జనంలో రాబోతున్నారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పంచాయితీ ఎన్నికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాల గురించి చర్చించారు.

 ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, “మనం పదేళ్ళు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నాము. కానీ ఒక్క ఏడాది కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేశారు.

నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను కానీ ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. నేను కాంగ్రెస్‌ పాలనని మౌనంగా, గంభీరంగా చూస్తున్నాను. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. చాలా గట్టిగానే కొడతాను. కాంగ్రెస్‌ చేతిలో భ్రష్టు పట్టిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనమే పోరాటాల ద్వారా కాపాడుకోవాలి. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెట్టుకుందాము,” అని కేసీఆర్‌ అన్నారు. 

సిఎం రేవంత్ రెడ్డిని గట్టిగా దెబ్బతీయబోతున్నానని, ఫిబ్రవరి నెలాఖరున ప్రజల మద్యకు రాబోతున్నాని కేసీఆర్‌ ప్రకటించేశారు కనుక సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు అందుకు సిద్దంగా ఉండాలి.