సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి ఈరోజు ఉదయం ఘోషా మహల్ పోలీస్ మైదానంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన సముదాయం నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే ఘోషా మహల్ వద్ద హాస్పిటల్ నిర్మించవద్దని స్థానికులు అభ్యంతరం చెపుతున్నారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా భూమిపూజకు వస్తుండటంతో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలియజేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ఘోషా మహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పురుషోత్తంని ఈరోజు తెల్లవారుజాము నుంచే పోలీసులు గృహ నిర్బందం చేశారు.
ఆయన స్పందిస్తూ, “ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని మేము వ్యతిరేకించడం లేదు. దానికి ఈ ప్రాంతం సరైనది కాదని మాత్రమే చెపుతున్నాము. చాలా ఇరుకు సందులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం వలన మున్ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
చిన్న వర్షం పడినా ఈ ప్రాంతమంతా నీళ్ళు చేరి ఎక్కడికక్కడ చెరువుల్లా మారిపోతుంది. కనుక ఇంత డబ్బు ఖర్చు చేసి హాస్పిటల్ నిర్మిస్తున్నప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుందని సూచిస్తున్నాము. కానీ ప్రభుత్వం మా సూచనల్ని పట్టించుకోకుండా ఇక్కడే హాస్పిటల్ నిర్మించడానికి సిద్దం అవుతోంది కనుకనే మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని అనుకున్నాము,” అని చెప్పారు.
ప్రస్తుతం మహా కుంభమేళాలో ఉన్న ఘోషా మహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇక్కడ హాస్పిటల్ నిర్మించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గోషా మహల్ ప్రాంతంలో నివసిస్తున్నవారు అభ్యంతరం చెపుతున్నప్పుడు ఓసారి వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలని రాజాసింగ్ సూచించారు. తాను హైదరాబాద్ తిరిగి రాగానే సిఎం రేవంత్ రెడ్డిని కలిసి దీని గురించి మాట్లాడుతున్నాని చెప్పారు.