బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు..వాయిదా

బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌ ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిగింది. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్ళారు. కనుక వారిపై చర్యలు చేపట్టాలని స్పీకర్‌ని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ శాసనసభ కార్యదర్శి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు ఖండిస్తూ, ఇప్పటికే స్పీకర్ సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. 

సుప్రీంకోర్టు స్వయంగా సదరు ఎమ్మెల్యేలు స్పందించేందుకు తగిన సమయం ఇవ్వాలని స్పీకర్‌కి సూచించిదనే విషయం గుర్తుచేశారు. తనకు కొంత సమయం ఇస్తే దీని గురించి శాసనసభ కార్యదర్శి నుంచి పూర్తి వివరాలు తీసుకొని కోర్టుకి సమర్పిస్తానని చెప్పడంతో ఈ కేసు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు న్యాయమూర్తులు.