నివేదిక రెడీ.. పంచాయితీ ఎప్పుడు?

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక సిద్దమైంది. రెండు మూడు రోజులలో ప్రభుత్వం చేతికి వస్తుంది. దాని ఆధారంగా బీసీ డెడికేటడ్‌ కమీషన్ నివేదిక కూడా త్వరలో సిద్దమవుతుంది. ఈ రెండు నివేదికలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. కనుక ఫిబ్రవరి రెండోవారంలో దీని కోసం శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

శాసనసభలో ఈ రెండు నివేదికలపై చర్చించి ఆమోదించిన తర్వాత తదనుగుణంగా పంచాయితీ ఎన్నికలలో రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ మార్చి-ఏప్రిల్ నెలల్లో పాఠశాలలు, కాలేజీ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతాయి. కనుక విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్నప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా?అని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలసి ఉంటుంది. ఒకవేళ వద్దనుకుంటే ఏప్రిల్ నెలాఖరులోగా పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎప్పుడు ఇచ్చినా వారం పది రోజులలోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.