నేటి నుంచి నాలుగు పధకాలు.. 606 గ్రామాల్లోనే!

ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ప్రకటించడం చాలా సులువు. కానీ గెలిచి అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడం చాలా కష్టం.. అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బాగా అర్దమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. అందుకు విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. కానీ నేటికీ హామీలు అమలు చేయలేకపోతున్నారు. 

నేటి నుంచి తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ మంత్రులు చెప్పారు. కానీ నేటి నుంచి రాష్ట్రంలో 606 మండలాలలో ఒక్కో గ్రామం చొప్పున 606 గ్రామాలలో మాత్రమే ఈ పద్ధకాలను అమలుచేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 

మొదట 606 గ్రామాలలో వీటిని ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి నెలాఖరులోగా రాష్ట్రమంతటా ఈ నాలుగు పధకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పధకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు రసాభాసగా ముగిశాయి. 

అందుకు బిఆర్ఎస్ నేతలు సిఎం రేవంత్ రెడ్డిని మంత్రులను విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నాలుగు పదకాలను మరో రెండు నెలలకు సాగదీస్తున్నందుకు మళ్ళీ విరుచుకు పడకుండా ఉండరు. 

ఈరోజు మద్యాహ్నం నారాయణపేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో సిఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు పదకాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన గ్రామాలలో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.