దావోస్ సదస్సులో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి బృందం రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించుకు రావడం మామూలు విషయమేమీ కాదు. అనేక దిగ్గజ కంపెనీలతో సదస్సులో ఒప్పందాలు చేసుకున్నారు.
వాటి వలన రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుంది.
ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది. కనుక తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతీ ఒక్కరూ ఇందుకు సంతోషించాల్సిందే.
కానీ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పెట్టుబడులు, ఒప్పందాలు అన్నీ బోగస్.. డ్రామా.. వాటి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాదని వాదిస్తూ సిఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణకు పెట్టుబడులు సాధించుకు వస్తే కడుపు మంటతో రగిలిపోతున్న బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు ఎసిడిటీ తగ్గించేందుకు వాడే ఇనో ప్యాకెట్లను పంపిస్తున్నారు. అంతేకాదు ఈరోజు హైదరాబాద్లో పలు ప్రాంతాలలో ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి.
వాటిలో ఓ పక్క కేసీఆర్ కడుపు పట్టుకొని ఉన్న బొమ్మ కింద “డైజెస్ట్ ది గ్రోత్” అని క్యాప్షన్ ఇచ్చారు. మద్యలో “పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ఇనో.. ఇనో ఆన్ కడుపు మంట గాన్” అంటూ ఇనో ప్రకటన వేశారు.
మరో పక్క రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు అని బ్యానర్లు వేశారు. వాటిని చూసి నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ బ్యానర్లు ఆన్లైన్, సోషల్ మీడియాలో కూడా రావడంతో యావత్ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు ప్రజలు వాటిని చూసి నవ్వుకుంటున్నారు.
మరి వాటికి పోటీగా బిఆర్ఎస్ పార్టీ కూడా బ్యానర్లు పెడుతుందా లేక సోషల్ మీడియాలో ఎదురుదాడితో సరిపెడుతుందా?