రేవంత్! దమ్ముంటే రా: కేటీఆర్‌ సవాల్

ఎఫ్-1 రేసింగ్ కేసులో నిన్న సాయంత్రం ఈడీ విచారణ ముగిసిన తర్వాత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఆయనపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నందునే తనపై కూడా తప్పుడు కేసులు నమోదు చేయించి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. 

తాను ఎటువంటి తప్పు చేయలేదని కనుక ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నీటికీ సమాధానాలు చెపుతానన్నారు. 

తనను విచారణకు పిలిపించిన ప్రతీసారి ఈ పోలీస్ బందోబస్తు వగైరా ఏర్పాట్లకు ప్రభుత్వానికి రూ.5-10 కోట్లు చొప్పున ఖర్చు అవుతోందని, ఆ సొమ్ముని రైతు బంధుకి లేదా వృద్ధుల పింఛన్లకు ఉపయోగించవచ్చన్నారు. కనుక అనవసరమైన ఈ ఖర్చు తగ్గించుకునేందుకు రేవంత్ రెడ్డికి మంచి ఆఫర్ ఇస్తున్నానని కేటీఆర్‌ అన్నారు. 

హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎదుట మీడియా సమక్షంలో ఓ బహిరంగ చర్చ పెట్టాలని సవాలు విసిరారు. న్యాయస్థానంలో లేదా జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఎక్కడైనా చర్చకు సిద్దామని కేటీఆర్‌ సవాలు విసిరారు. అక్కడ ఇద్దరం చేతులకు ‘లై డిటెక్టర్లు’ పెట్టుకొని ఇద్దరి కేసుల గురించి న్యాయమూర్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుదామన్నారు. 

ఈవిదంగా చేస్తే తక్కువ ఖర్చుతో ఈ రెండు కేసులలో ఎవరు దొంగలో ఎవరు నిజాయితీపరులో తేలిపోతుందని కేటీఆర్‌ అన్నారు. ప్లేసు, డేటు, టైమ్ అన్నీ మీరే నిర్ణయించుకొని చెపితే నేను వచ్చేందుకు సిద్దం అని చెప్పారు.              దమ్ముంటే బహిరంగ చర్చకు ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ సవాలు విసిరారు.