మోహన్ బాబుని అరెస్ట్‌ చేయొద్దు: సుప్రీంకోర్టు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనని అరెస్ట్‌ చేయవద్దని తెలంగాణ పోలీస్ శాఖని ఆదేశించింది. 

గత నెలలో జల్‌పల్లి నివాసంలో ఆయనకు, రెండో కుమారుడు మంచు మనోజ్‌ ఘర్షణ పడుతున్నప్పుడు మీడియా సిబ్బంది లోనికి ప్రవేశించి ఆయనని ప్రశ్నించబోయారు. కొడుకు తీరుతో అప్పటికే తీవ్ర ఆందోళన, ఆవేశంతో ఉన్న మోహన్ బాబు, తమని చిత్రీకరిస్తున్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌ చేతిలో మైకు లాక్కొని అతనిపై దాంతోనే దాడి చేశారు. ఆ దాడిలో గాయపడిన అతను పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై పిర్యాదు చేశారు. 

పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. 

ఆయన తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ని కలిసి క్షమాపణలు చెప్పుకొని కేసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ అతను అంగీకరించకపోవడంతో అరెస్ట్‌ అనివార్యమని గ్రహించి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుని అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఉపశమనం పొందారు.