కేటీఆర్‌ అరెస్ట్ తప్పదా?

ఫార్ములా 1 రేసింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్నే హైకోర్టు కొట్టివేసింది. కేటీఆర్‌ మధ్యంతర బెయిల్‌ కూడా హైకోర్టు పొడిగించలేదు. 

కేటీఆర్‌ నిన్న ఏసీబీ విచారణకి వచ్చినప్పుడు ఈ కేసు హైకోర్టులో ఉంది. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువడుతుంది కనుక అంతవరకు తనకు సమయం ఇవ్వాలని లిఖిత పూర్వకంగా ఏసీబీని కోరి విచారణకు హాజరుకాకుండా వెళ్ళిపోయారు.

ఇదే కేసులో ఈడీ కూడా ఆయనకి నోటీస్ పంపించి నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు హైకోర్టు ఆయన పిటిషన్‌ కొట్టివేయడమే కాకుండా బెయిల్‌ కూడా పొడిగించలేదు.

కనుక ఏసీబీ విచారణని తప్పించుకున్నా ఈడీ విచారణ తప్పించుకోలేరు. ఈలోగా ఏసీబీ మరోసారి నోటీస్ పంపించి విచారణకు రప్పించి అరెస్ట్‌ చేయవచ్చు లేదా ఏసీబీ కంటే ముందే ఈడీ అరెస్ట్‌ చేసినా ఆశ్చర్యం లేదు.    

కేటీఆర్‌ అరెస్ట్‌ అనివార్యంగా కనిపిస్తుండటంతో ఆయన న్యాయవాదులు ఈరోజే హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయబోతున్నారు. 

ఒకవేళ సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించి నేడే విచారణ చేపట్టి మద్యంతర బెయిల్‌ ఇస్తే పరవాలేదు. కానీ ఆలస్యం అయితే ఏసీబీ లేదా ఈడీ ఏదో ఒకటి కేటీఆర్‌అని అరెస్ట్‌ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.