మెట్రో ఏర్పాటుకు హైదరాబాద్ నగరం అంతా ఒక ఎత్తైతే పాతబస్తీ ఒక్కటీ ఒక ఎత్తు అన్నట్లు మారినందునే ఇన్నేళ్ళుగా ఆ ప్రాంతానికి మెట్రో ఏర్పాటు కాలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితర స్థానిక పెద్దలతో మాట్లాడి వారి సహకారంతో మెట్రో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు.
ఆ మార్గంలో ఇళ్ళు, దుకాణాలు, భవనాలు కోల్పోయేవారికి నేడు ప్రభుత్వం నష్ట పరిహారంగా చెక్కులు అందించబోతోందని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చెక్కుల పంపిణీ తర్వాత రెండు మూడు నెలల్లోగా వారందరూ తమ ఇళ్ళు ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది.
ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మద్య ఈ కారిడార్-6లో మొత్తం 1,100 ఆస్తులు ఉండగా వారిలో 169 మంది వాటిని అప్పగించేందుకు అనుమతి పత్రాలు ఇచ్చారు. వాటిలో 40 మందికి చెందిన ఆస్తుల ధృవీకరణ పూర్తవడంతో సోమవారం మద్యాహ్నం 2 గంటల నుంచి వారందరికీ (చదరపు గజానికి రూ.81,000 చొప్పున) లక్డీకపూల్ వద్ద హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో చెక్కులు అందజేయబోతున్నామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. దీంతో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం పునరావాస పరిహారం ప్రకారం మరికొంత మొత్తం వారికి అందజేస్తామని చెప్పారు.
అయితే 1,100 మందిలో ఇప్పటి వరకు 169 మంది మాత్రమే తమ ఆస్తులు అప్పగించారు. మిగిలినవారు కూడా ప్రభుత్వానికి ఇళ్ళు అప్పగించేందుకు అంగీకరించి నష్టపరిహారం తీసుకుంటే కానీ మెట్రో పనులు మొదలుపెట్టడం సాధ్యం కాదు.
వారినీ ఒప్పించి ఖాళీ చేయిందుకు మజ్లీస్ నేతలు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశః మరో 6-8 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే హెచ్ఏఎంఎల్ వాటిని కూల్చివేతలు ప్రారంభించ గలదు. అంటే 2026లో పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉందని భావించవచ్చు.