మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు షురూ

ఆదివారం అంటే హైడ్రా కూల్చివేతల రోజని హైదరాబాద్‌ ప్రజలు ఖాయం చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇవాళ్ళ హైడ్రా అధికారులు, సిబ్బంది జేసీబీలతో మాదాపూర్ చేరుకొని అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. వంద అడుగుల రోడ్డుని ఆనుకొని అక్రమంగా నిర్మించినందున ఆ భవన యజమానులకు కొన్ని నెలల క్రితమే నోటీస్ ఇవ్వగా వారు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఇది అక్రమకట్టడమే అని ధృవీకరించింది. 

అయినప్పటికీ భవన యజమానులు దానిని కూల్చివేయకపోవడంతో హైడ్రా కమీషనర్ రంగనాధ్ శనివారం అక్కడకు వెళ్ళి భవనాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా భవనంలో ఉన్నవారినందరినీ ఖాళీ చేయించి, భవనానికి విద్యుత్ సరఫరా నిలిపి వేయించారు. ఈరోజు ఉదయమే భారీగా పోలీసులను మోహరించి కూల్చివేతలు మొదలుపెట్టారు.