ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఈడీ కూడా జోక్యం చేసుకొని మాజీ మంత్రి కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ ముగ్గురినీ విచారణకు హాజరు కావాలసిందిగా నోటీసులు పంపింది. ఈ కేసులో కేటీఆర్‌ని ఏ-1గా పేర్కొని ఈ నెల 7న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేసులో ఏ-2, ఏ-3లుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లను 3,4 తేదీలలో హాజరు కావాలని నోటీసులు పంపింది.
కానీ వారిరువురూ తమకు రెండు వారాల సమయం కావాలని లేఖ ద్వారా కోరారు. కనుక ఈరోజు విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. వారి లేఖలపై స్పందించిన ఈడీ రెండు వారాలు గడువు ఇవ్వడం కుదరదని ఈ నెల 8,9 తేదీలలో తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వారు వస్తారో లేదో ఇంకా తెలియదు కానీ వారి కంటే ముందు 7వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు కావలసి ఉంది. కానీ ఆయన కూడా హాజరు కాకపోవచ్చు.
ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ తాను వేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో ఉన్నందున, తీర్పు వెలువడే వరకు రాలేనని చెప్పి కేటీఆర్ తప్పించుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు పంపినప్పుడు ఆమె ఇదే విదంగా విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఆమె నివాసంలోనే అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించి తిహార్ జైల్లో పెట్టారు. కనుక ఒకవేళ కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే, ఈడీ అధికారులు ఆయన ఇంటికే వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఆయనకు జనవరి 6 వరకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదేరోజు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దానిని బట్టి ఈడీ తదుపరి చర్యలు ఉంటాయి.