సంక్రాంతి నుంచి రైతు భరోసా షురూ

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా కూడా ఒకటి. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏకరాకు రూ.7,500 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.15,000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆర్ధిక సమస్యల కారణంగా ఇంతవరకు ఈ హామీని అమలుచేయలేకపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పధకం అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

దీనిపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

గురువారం వారు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై తమ ప్రతిపాదనలపై మరోసారి చర్చించారు. వాటిలో ప్రధానమైనవి.. 

రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న భూములకు ఎకరాల పరిమితి లేకుండా ఈ పధకం అమలుచేయాలని నిర్ణయించారు. ఆదాయపన్ను చెల్లించేవారికి కూడా ఈ పదకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. 

ఈ లెక్కన రాష్ట్రంలో యాసంగిలో 80 లక్షల ఎకరాలకు, వానాకాలంలో 40 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1.20 కోట్ల ఎకరాలకు ఈ పధకం వర్తింపజేయాలని నిర్ణయించారు.  

ఎన్నికలలో ప్రకటించిన్నట్లు రూ.7,500 కాకుండా రూ.6,000 మాత్రమే చెల్లించాలని నిర్ణయించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

రాష్ట్రంలో పలు వ్యవసాయ భూములు నివాస లేదా వాణిజ్య ప్రాంత భూములుగా మార్పిడి జరిగి వాటిలో అపార్ట్‌మెంట్‌, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు నిర్మించారు. కానీ నేటికీ పాసుపుస్తకాలలో మాత్రం అవి వ్యవసాయభూములుగానే చూపిస్తున్నారు. కనుక వాటిని పాసు పుస్తకాలలో నుంచి తొలగించి వాటికి ఈ పధకం వర్తింపజేయరాదని నిర్ణయించారు. 

ఈ నెల 5,6,7 తేదీలలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన రైతులను నుండి రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు.