తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుని ఇంకా ఎన్నాళ్ళు విచారణ జరుపుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరుగా ఉన్న ఎస్పీ తిరుపతన్నబెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది.
అతని తరపు న్యాయవాది సిద్ధార్థ దవే తన వాదనలు వినిపిస్తూ గత 9 నెలలుగా తిరుపతన్న జైలులో మగ్గుతున్నారని తెలిపారు. ఆయనపై ఛార్జ్-షీట్ కూడా దాఖలైందని, కానీ బెయిల్ పొందేందుకు పోలీసులు అభ్యంతరం చెపుతున్నారన్నారు.
ఈ కేసులో ఆయన నిందితుడే అయినప్పటికీ ఆయనకి కూడా పౌర హక్కులు ఉంటాయని వాటిని గౌరవించి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు.
ఆయన వాదనలపై స్పందించిన న్యాయమూర్తులు ఈ కేసు విచారణ ఇంకా ఎంత కాలం సాగుతుందని తెలంగాణ ప్రభుత్వం తరపు వాదిస్తున్న న్యాయవాది సిద్దార్ధ లుద్రాని ప్రశ్నించారు. మరో నాలుగు నెలలు సమయం పడుతుందని ఆయన చెప్పగా, లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని న్యాయమూర్తులు సూచించారు. అందుకు ఆయన అంగీకరించి సమయం కొరడంతో ఈ కేసు తదుపరి విచారణని ఈ నెల 27కి వాయిదా వేశారు.