సోమవారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

రేపు (సోమవారం) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. దివంగత ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌ మృతికి సంతాపం పాటించి ఆయనకు నివాళులు అర్పించేందుకు రేపు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ లేఖల ద్వారా తెలియజేశారు. ఫోన్ చేసి కూడా చెప్పారు. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విధిగా హాజరవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. రేపటి సమావేశంలో డా.మన్మోహన్ సింగ్‌ మృతికి సంతాపం పాటించి, నివాళులు అర్పించడంతో ముగుస్తుంది. రేపటి సమావేశంలో వేరే అంశాలపై ఎటువంటి చర్చ జరుగబోదని చెప్పారు. 

రేపు ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశం కాగానే సిఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం సభలో ప్రవేశపెడతారు. దానిపై సభలో చర్చించిన తర్వాత తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు.

రేపు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం రద్దయింది. డా.మన్మోహన్ సింగ్‌ మృతికి వారం రోజులు సంతాపదినాలుగా పాటిస్తున్నందున, అవి ముగిసిన తర్వాత జనవరి మొదటి వారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.