సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఆయన కోర్టుకి వస్తే మళ్ళీ అభిమానులతో అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కనుక అల్లు అర్జున్ తన ఇంటి నుంచే వర్చువల్ పద్దతిలో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు ఆయన తరపు న్యాయవాదులు ముందే అనుమతి తీసుకున్నారు.
ఈ విషయం తెలియని ఆయన అభిమానులు తమ హీరోని చూసేందుకు భారీ సంఖ్యలో నాంపల్లి కోర్టు వద్దకు చేరుకుంటున్నారు. పోలీస్ శాఖ ముందుగానే ఇది ఊహించినందున కోర్టు చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించింది. అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకి రారని, వర్చువల్ పద్దతిలో ఇంటి నుంచే విచారణలో పాల్గొంటారని పోలీస్ అధికారులు మైకులలో చెపుతూ, అభిమానులను తిరిగి వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నారు.
ఈ కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, ఆయన హైకోర్టుని ఆశ్రయించి మద్యంతర బెయిల్ పొందారు. హైకోర్టు సూచన మేరకు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఒకవేళ నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన్నట్లయితే, ఆ తీర్పుని సవాలు చేస్తూ పోలీస్ శాఖ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. కనుక ఇక్కడితో ఈ న్యాయపోరాటం ముగిసిపోదు.