ఎర్రోళ్ళ శ్రీనివాస్ అరెస్ట్‌.. వెంటనే బెయిల్‌

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎస్సీ-ఎస్టీ కమీషన్ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ని ఈరోజు ఉదయం నాంపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కానీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తిచేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగానే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్‌ దరఖాస్తు సమర్పించగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. రూ.5,000ల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించగా వెంటనే ఆ సొమ్ము జమా చేసి, ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ నేతలు ష్యూరిటీ పత్రాలు సమర్పించడంతో జైలుకి తరలించకముందే బెయిల్‌పై విడుదలయ్యారు. 

నాంపల్లి పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఎర్రోళ్ళ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావలసిందిగా మూడుసార్లు నోటీసులు పంపారు. కానీ ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అనుమతితో అరెస్ట్‌ వారెంట్ జారీ చశారు. 

బిఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేక్ తదితరులు మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌ చేరుకొని ఆయనకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇటువంటి చిల్లర కేసులు నమోదు చేయిస్తూ, బిఆర్ఎస్ పార్టీ నేతలను వేదిస్తోందని, కానీ ఇటువంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని హరీష్ రావు అన్నారు.