గురువారం ఉదయం సిఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ

ప్రముఖ నిర్మాత, టిఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు చొరవ తీసుకొని సిఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ ప్రముఖులతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.

అల్లు అర్జున్‌ వ్యవహారంలో మొత్తం సినీ పరిశ్రమకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కనుక సినీ ప్రముఖులు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చుకొని, సినిమా ప్రదర్శలపై ఆంక్షలు విధించవద్దని విజ్ఞప్తి చేయనున్నారు.

సినీ పరిశ్రమకు ఎంతో కీలకమైన సంక్రాంతి సీజన్లో గేమ్ చేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం, డాకూ మహరాజ్ వంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. కనుక వాటికి నష్టం కలగకుండా జాగ్రత్తపడుతూనే, సినీ పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి మద్య ఏర్పడిన విభేధాలు పరిష్కరించుకునేందుకు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తారు.

సిఎం రేవంత్ రెడ్డి కూడా సినీ పరిశ్రమపై తనకు ఎటువంటి కక్షలేదని, కానీ సినీమా ఫంక్షన్స్, రిలీజ్ అయినప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని చెప్పారు. కనుక సినీ ప్రముఖులు అందుకు తగిన పరిష్కారంతోనే సిఎం రేవంత్ రెడ్డిని కలువబోతున్నారు కనుక రేపటితో ఈ సమస్యలన్నీ కొలిక్కి రావచ్చు. సంక్రాంతి సీజన్లో సినిమాలపై ఆంక్షలు విధించకుండా ప్రదర్శించుకునేందుకు అనుమతించే అవకాశం ఉంది.