వీఆర్‌వోల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కేసీఆర్‌ హయంలో రాష్ట్రంలో వీఆర్‌వో వ్యవస్థని రద్దు చేశారు. వారిలో క్రమబద్దీకరించబడిన కొందరిని వివిద ప్రభుత్వ శాఖలలో సర్దేశారు. అయితే గ్రామస్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి తోడ్పడటానికీ వీఆర్‌వో వ్యవస్థ చాలా అవసరమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

కనుక రాష్ట్రంలో మళ్ళీ వీఆర్‌వో వ్యవస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ కూడా పంపింది. ఇదివరకు వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేయక మునుపు దానిలో వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పనిచేసినవారు, ప్రభుత్వ శాఖలలోకి వెళ్ళినవారు, ఇంకా ఈ ఉద్యోగాలకు అర్హులైన ఆసక్తిగల ఇతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సర్క్యులర్‌లో సూచించింది. డిసెంబర్‌ 28లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని గడువు కూడా విధించింది.

కనుక న్యాయపరమైన సవాళ్ళు ఎదురవకపోతే జనవరిలో సంక్రాంతి పండుగ ముందో తర్వాత నుంచి గ్రామాలలో మళ్ళీ వీఆర్‌వోలు కనిపించే అవకాశం ఉంది.