శ్రీనివాస్ గౌడ్ కొత్త సమస్య తెచ్చిపెట్టారుగా!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య నేటికీ ఎంతో కొంత విభేధాలున్నాయి. అవి రెండు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు సెంటిమెంట్ రాజకీయాలు చేసుకునేందుకు బాగా ఉపయోగపడుతుండటంతో అవసరమైనప్పుడల్లా నిప్పు రాజేసి ప్రయోజనం పొందుతున్నారు. 

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కూడా అటువంటి ఉద్దేశ్యం ఉందో లేదో తెలీదు కానీ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ భక్తులు, ప్రముఖుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. 

అంతకు కొన్ని వారాల ముందే, తిరుమల కొండపై ఎవరూ రాజకీయాలు మాట్లాడకూడదని, మాట్లాడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి తీర్మానం చేసి ఆమోదించింది. కనుక శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు చెప్పారు. ముందుగా న్యాయనిపుణుల సలహా తీసుకొని ఈ నెల 24న టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

ఒకవేళ ఆయనపై టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీ దానిని ఆంధ్రా-తెలంగాణ సమస్యగా చిత్రీకరించక మానదు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన శ్రీనివాస్ గౌడ్ ఆ పని ముగించుకొని వచ్చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు కదా?