ఇక ప్రివిలేజ్ షోలు ఉండవు: రేవంత్ రెడ్డి

పుష్ప-2 విడుదలైనప్పుడు సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ నేటికీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఇంకా ఎప్పటికీ కొలుకుంటాడో ఎవరికీ తెలీదు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలుడికి ఇంకా తల్లి చనిపోయిన సంగతి తెలీదు కూడా. 

సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ విషయం ప్రస్తావిస్తూ, “సినీ పరిశ్రమకి ఎప్పటిలాగే మా ప్రభుత్వం తోడ్పాటు ఉంటుంది. మీరు చక్కగా సినిమాలు తీసుకోండి. ప్రదర్శించుకోండి. వాటితో బాగా డబ్బు సంపాదించుకోండి. ప్రభుత్వం మీకు అన్ని ప్రోత్సాహకాలు అందిస్తుంది. కానీ మీ సినిమాల కోసం ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదు. 

సంధ్య థియేటర్‌ వద్ద అదే జరిగింది. ప్రజల ప్రాణాలను బలిగొనే బెనిఫిట్ షోలు, ప్రివిలేజ్ షోలకు ఇకపై అనుమతించం. నేను ఈ కుర్చీలో ఉన్నంతకాలం ఇకపై ప్రివిలేజ్ షోలను అనుమతించే ప్రసక్తే లేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. 

త్వరలో వరుసగా గేమ్ చేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం, డాకూ మహరాజ్, రాజాసాబ్, విశ్వంభర వంటి అనేక పెద్ద  సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటన్నిటికీ పుష్పరాజ్ దెబ్బ తగిలింది.