శాసనసభ సమావేశంలో ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంపై చర్చ జరపాలని పట్టుబడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగా జవాబిచ్చారు. “మీరందరూ దీనిపై సభలో చర్చకు ఎందుకు పట్టుబడుతున్నారో నాకు బాగా తెలుసు.
ప్రస్తుతం ఏసీబీ ఈ కేసు విచారణ జరుపుతోంది. కేటీఆర్ స్వయంగా హైకోర్టులో దీనిపై పిటిషన్ వేశారు. పోలీస్ శాఖ, హెచ్ఎండీఏ రెండు శాఖలు నా దగ్గరే ఉన్నాయి. కనుక నేను శాసనసభలో ఈ కేసు గురించి ఏమైనా కొత్త విషయాలు మాట్లాడితే వాటిని పట్టుకొని కేసుని ప్రభావితం చేస్తున్నామని వాదించాలని బిఆర్ఎస్ ఎత్తుగడ వేస్తోంది.
కోర్టు, ఏసీబీ విచారణలో ఉన్న ఈ కేసు గురించి అందుకే నేను సభలో మాట్లాడటం లేదు. కానీ న్యాయనిపుణులు, సంబందిత అధికారులను సంప్రదించి అభ్యంతరం లేకపోతే ఈ కేసుకి సంబందించి ప్రతీ విషయాన్ని తేదీలతో సహా సభ ముందుంచి చర్చిస్తాను.
నేను ఎఫ్ఈవో ప్రతినిధితో భేటీ అయిన ఫోటోని కేటీఆర్ మీడియాకు విడుదల చేసి ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్నట్లు మాట్లాడారు. కానీ ఆనాడు ఎఫ్ఈవో ప్రతినిధి వచ్చి నన్ను కలిసి ఈ తెర వెనుక ఒప్పందాల గురించి చెప్పిన తర్వాతే నాకు ఈ గూడుపుఠాణీ గురించి అర్దమయింది. లేకుంటే ఈ విషయం నా దృష్టి వచ్చేందుకు ఇంకెంత సమయం పట్టేదో?
ఇన్నాళ్ళూ ఈ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఏనాడూ వాటిపై కేటీఆర్ స్పందించలేదు. కానీ ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయగానే మీడియా ముందుకు వచ్చి గడగడా మాట్లాడుతున్నారు. శాసనసభలో చర్చ జరగాలని పట్టుబడుతున్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.