పాపం హరీష్.. అలా బుక్ అయిపోయారేమిటో !

ఈరోజు శాసనసభలో ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంపై చర్చ జరపాలని బిఆర్ఎస్ ఎంతగా పట్టుబట్టినప్పటికీ అధికార పార్టీ పట్టించుకోలేదు. పైగా అవుటర్ రింగ్ రోడ్ టెండర్స్ వ్యవహారంలో అవకతవకలపై హరీష్ రావు, సిఎం రేవంత్ రెడ్డి మద్య వాడి వేడిగా వాదోపవాదాలు జరిగినప్పుడు మరో అనూహ్య పరిణామం జరిగింది. 

ఆ ‘టెండర్లు రద్దు చేయాలని’ హరీష్ రావు సవాలు విసరగా, సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకుడు తమ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పట్టుబడుతున్నారు. కనుక ఆయన అభీష్టం మేరకు ప్రత్యేక విచారణకి ఆదేశిస్తున్నాను,” అని ప్రకటించడంతో హరీష్ రావు కంగు తిన్నారు. 

వెంటనే తేరుకొని “నేను టెండర్లు రద్దు చేయమని మాత్రమే అడిగాను. కానీ నేను విచారణ జరిపించమన్నానని సిఎం రేవంత్ రెడ్డి సభని తప్పు దోవ పట్టిస్తున్నారు. అయినప్పటికీ మాకేం భయం లేదు. టెండర్లు రద్దు చేసి విచారణ జరిపించుకోండి,” అని సవాలు విసిరారు. 

ఇదివరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇలాగే రేవంత్ రెడ్డికి సవాలు విసిరి అడ్డంగా దొరికిపోయారు. అప్పుడే దానిపై విచారణ జరిపేందుకు కమీషన్ ఏర్పాటు చేశారు.

కమీషన్ నివేదిక కూడా ప్రభుత్వం చేతికి వచ్చిన్నట్లు సమాచారం. దానిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టక మునుపే అవుటర్ రింగ్ రోడ్ టెండర్ల వ్యవహారంలో హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డితో వాదోపవాదాలకు దిగి, దానిపై కూడా విచారణ జరిగేలా చేశారు. ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ టెండర్ల విచారణ కూడా బిఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకోబోతోంది.