కేటీఆర్‌ని అరెస్ట్‌ చేస్తే రాష్ట్రంలో విధ్వంసానికి కుట్ర?

సీనియర్ కాంగ్రెస్‌ నేత, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఏసీబీ అధికారులు కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసిన్నట్లయితే, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల పేరుతో విధ్వంసం సృష్టించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. 

ఈ కుట్రలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ, దాని ముసుగులో గూండాలు ప్రజల, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మాకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులపై ఎక్కడికక్కడ దాడులు చేసి వాటిని తగులబెట్టి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. 

దీని కోసం కేటీఆర్‌కి అత్యంత సన్నిహితుడు తేలుకుంట శ్రీధర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అల్లర్లు, విధ్వంసం సృష్టించేందుకుగాను నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున మొత్తం వంద కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైనట్లు, ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఆ డబ్బు చేరిందని మరికొన్ని నియోజకవర్గాలకు తరలిస్తున్నారని మా ప్రభుత్వానికి సమాచారం ఉంది. 

కనుక పోలీసులను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈవిషయం నేను మీడియా ముందుకు వచ్చి బయటపెడుతున్నాను. పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.