ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషయంలో థియేటర్ యాజమాన్యం, పోలీసులు పరస్పరం నిందించుకుంటున్నారు. ఆ రోజు రాత్రి 9.30 గంటల పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ తదితరులు రాబోతున్నారని తాము ముందే చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని లిఖిత పూర్వకంగా కోరామని థియేటర్ యాజమాన్యం చెపుతోంది.
థియేటర్ యాజమాన్యం బందోబస్తు కోసం తమని సంప్రదించిన మాట నిజమేనని, కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిత్యం రద్దీగా ఉంటుందని, థియేటర్‌కి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా ఉంటుందని, కనుక నటీనటులు ఎవరినీ రావద్దని ముందే తెలియజేశామని పోలీసులు చెపుతున్నారు.
కానీ తాము వారించినప్పటికీ అల్లు అర్జున్ థియేటర్‌కి వచ్చారని, ఆ కారణంగానే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజూ నాయక్ సోమవారం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తికి తెలియజేశారు. థియేటర్ యాజమాన్యానికి తాము వ్రాసిన లేఖ ప్రతిని కూడా న్యాయమూర్తికి అందజేశారు.
నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, హైకోర్టు దానిపై స్టే విధించింది. మళ్ళీ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవాలని అల్లు అర్జున్‌కి సూచించింది. ఆ కేసు విచారణలోనే సంధ్య థియేటర్ యాజమాన్యం, చిక్కడిపల్లి పోలీసుల తరపు న్యాయవాదులు నిన్న నాంపల్లి కోర్టులో తమ వాదనలు వినిపించారు.