తెలంగాణ తల్లి వివాదం: హైకోర్టుకి

సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న సచివాలయ ఆవరణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 20 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం ఆవిష్కరించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లికి పూర్తి భిన్నమైన రూపురేఖలతో విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెపుతోంది. తాము అధికారంలోకి రాగానే అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తొలగించేస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ హెచ్చరించారు కూడా. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో విగ్రహావిష్కరణకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 

ఇటువంటి సమయంలో జూలూరి గౌరీ శంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, విగ్రహావిష్కరణని నిలిపివేయించాలని పిటిషన్‌ ద్వారా హైకోర్టుని అభ్యర్ధించారు.

ఆయన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కానీ రేపు ఆదివారం కోర్టుకి సెలవు. కనుక సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. కానీ సోమవారమే విగ్రహావిష్కరణ జరుగబోతోంది. కనుక విగ్రహావిష్కరణ తర్వాత హైకోర్టు ఏం  చెపుతుందో?

బహుశః ఇరు పక్షాల వాదోపవాదాలు ముగిసి తీర్పు చెప్పేవరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుడ్డతో కప్పి ఉంచాలని మద్యంతర ఉత్తర్వు జారీ చేస్తుందేమో?