తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు, పెను ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, కేంద్రానికి చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి. కానీ ఇక నుంచి తెలంగాణకు మెరికల్లాంటి 2,000 మంది సుశిక్షితులైన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్రంలోని 137 అగ్నిమాపక సిబ్బంది నుంచి వెయ్యి మందికి, తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగం నుంచి మరో వెయ్యి మంది కలిపి 2,000 మందితో దీనిని ఏర్పాటు చేశారు. వీరికి తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో గల ఎన్‌డీఆర్ఎఫ్ శిక్షణా కేంద్రాలలో అవసరమైన శిక్షణ ఇప్పించారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడే సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రూ.35.03 కోట్లు నిధులు విడుదల చేసి, వారికి అవసరమైన అత్యాధునిక పరికరాలు, వాహనాలు, మరబోట్లు, ప్రత్యేక దుస్తులు వగైరా అన్నీ కొనుగోలు చేశారు.
భవనాల శిధిలాల క్రింద చిక్కుకుపోయినవారిని, అగ్ని ప్రమాదలలో చిక్కుకున్నవారిని, వరద నీటిలో కొట్టుకుపోతున్న లేదా నీటిలో మునిగిపోయినవారిని కాపాడేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే యంత్రాలు, పరికరాలు వగైరా ప్రభుత్వం కొనుగోలు చేసి సిద్దంగా ఉంచింది.
సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఈ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ని ప్రారంభించబోతున్నారు.
రాష్ట్రంలో అగ్నిమాపక కేంద్రాలన్నీటికీ కూడా ఇటువంటి అత్యాధునిక పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేసి వాటిని కూడా టిజిఎస్‌డీఆర్‌ఎఫ్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయబోతున్నారు.