మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపి, శివసేన, ఎన్సీపీ మహాయుతి కూటమి విజయం సాధించినప్పటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన నెలకొంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి పదవిని బీజేపికి ఇచ్చి తాను ఉప ముఖ్యమంత్రిగా సర్దుకుపోయేందుకు మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండే అంగీకరించడంతో నేడు ప్రమాణ స్వీకారాలు జరిగాయి. 

దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాధ్ ఏక్‌నాధ్ షిండే, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కారీ తదితరుల సమక్షంలో వారు ప్రమాణ స్వీకారాలు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఏపీ, మద్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మోహన్ యాదవ్, యోగీ ఆదిత్యనాధ్, భజన్‌ లాల్ శర్మతో సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపి ముఖ్యనేతలు పాల్గొన్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో వారం రోజులుగా సాగుతున్న నాటకీయ పరిణామాలు ముగిసిన్నట్లే భావించవచ్చు. 

మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలలో బీజేపి 132, షిండే శివసేన 57, ఎన్సీపీ 41 కలిపి మొత్తం 233 స్థానాలు గెలుచుకున్నాయి. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 16, ఉద్దవ్ థాక్రే-శివసేన 20, ఎన్సీపీ (ఎస్‌పీ) 10, సమాజ్‌వాదీ పార్టీ 2, స్థానాలు గెలుచుకున్నాయి. మజ్లీస్ పార్టీ, సీపీఎం చెరో సీటు గెలుచుకున్నాయి.