కేసులు పెట్టుకోండి.. ముందస్తు బెయిల్ తీసుకుంటాం!

మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, వేధింపులకు పాల్పడినందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై ఆయన స్పందిస్తూ “నేను ఏ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రశ్నిస్తున్నందునే రాజకీయ కక్షతో నాపై ఈ అక్రమ కేసు నమోదు చేశారు. నాపై మరో లక్ష కేసులు పెట్టుకున్నా నేను భయపడను. పోరాడుతూనే ఉంటాను,” అని అన్నారు. 

అంత మాత్రాన్న జైలుకి వెళ్ళి కూర్చోవాలని అనుకోరు కనుక హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనపై రాజకీయ కక్షతో నమోదు చేసిన ఈ అక్రమ కేసుని రద్దు చేయాలని, తనను పోలీసులు అరెస్ట్ చేయకూడదని ఆదేశించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

సిద్ధిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జి చక్రధర్ గౌడ్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో తాను నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో తాను రాజకీయాలలో పోటీగా మారుతానని హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డి రాధాకృష్ణ సాయంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించి, తనపై తప్పుడు కేసులు నమోదు చేయించి వేధించారని పేర్కొన్నారు.

కనుక వారిరువురిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దానిపై స్పందిస్తూ పోలీసులు హరీష్ రావు, రాధాకృష్ణ ఇద్దరిపై ఐటి చట్టంలో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 

ఆ కేసునే కొట్టివేసి తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది.