వారిపై ఇంకా కటిన చర్యలు ఉంటాయిట!

ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నోట్ల మార్పిడి నిర్ణయం దేశంలో ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. పెంటకుప్పలలో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. ఇదివరకు జనాలు గంగానదిలో చిల్లర పైసలు మాత్రమే వేసేవారు. కానీ ఇప్పుడు నోట్ల కట్టలు వేస్తున్నారు. యూపిలో నోట్ల కట్టలని కాల్చేశారు. ఆంధ్రాలో విశాఖ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నిరుపేదలకి ఎవరో గుర్తు తెలియని వారు వచ్చి ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున పంచి పెట్టి వెళ్ళిపోయారు. ‘మీ అకౌంట్ లో లక్ష వేస్తాము’ అంటూ అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి సామన్య పౌరులకి ఫోన్లు వస్తున్నాయి. ఇటువంటి వింతలు, విడ్డూరాలు అన్నీ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొన్న ఒకే ఒక నిర్ణయంతో జరుగుతున్నాయని తెలుసు. ఇక ముందు కూడా ఇంతకంటే పెద్ద వింతలు జరిగే అవకాశం ఉందని చెపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

ఆయన జపాన్ పర్యటనలో భాగంగా శనివారం కోబే నగరంలో భారతీయులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనం చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నాము. దానికి మద్దతు తెలుపుతున్న భారతీయులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. దీని వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అది తాత్కాలికమే. వారికి ఎటువంటి నష్టమూ కలుగదు. కానీ నల్లధనం పోగేసుకొని కూర్చొన్నవారికి మాత్రం ఇంకా ఇబ్బందులు తప్పవు. వారికి ప్రభుత్వం ఒక చాలా సమయం (12 నెలలు) ఇచ్చింది. కొంతమంది తమ వద్ద ఉన్న నల్లధనం బయటపెట్టారు. కానీ ఇంకా చాలా మంది బయటపడలేదు. అటువంటి వారందరినీ బయటకి లాగే ప్రయత్నమే ఇది. ఒకవేళ ఇప్పటికీ లొంగకపోతే వారిపై కటిన చర్యలు తప్పవు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు వారి సంపాదన చరిత్రలన్నీ తవ్వి తీయించి మరీ వారి భరతం పడతాను. కనుక అటువంటి నల్లకుభేరులు అందరికీ ఇదే చిట్ట చివరి అవకాశం. ఇప్పటికైనా మేలుకొని తప్పులు సరిదిద్దుకోవలసిందిగా కోరుతున్నాను. మార్చి 31 తరువాత వారితో ప్రభుత్వం వ్యవహరించే తీరు వేరే విధంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి,” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.