తెరాస సర్కార్ కి గవర్నర్ నరసింహన్ ఊహించని షాక్ ఇచ్చారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ ఇళ్ళ అమ్మకాల ద్వారా సంపాదించిన ఆదాయంపై వడ్డీతో కలిపి సుమారు రూ.1600 కోట్లు పన్ను చెల్లించవలసి ఉంది. హౌసింగ్ బోర్డ్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే విభాగమే కనుక దానికి పన్ను మినహాయించాలని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని ఆదాయపన్ను అప్పీలేట్ కోర్టు అంగీకరించలేదు. హౌసింగ్ బోర్డు చట్ట ప్రకారం అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే అయినప్పటికీ, అది ప్రభుత్వంలో భాగం కాదని, అది ఒక స్వతంత్ర వ్యాపార సంస్థ అని, ఇతర ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల లాగే అది కూడా ఇళ్ళు, స్థలాలు అమ్మకాలు చేస్తూ లాభాలు ఆర్జిస్తోందని కనుక తప్పనిసరిగా అది వడ్డీతో సహా రూ.1,600 కోట్లు పన్ను చెల్లించవలసిందేనని తీర్పు చెప్పింది.
ఈ సమస్య నుంచి హౌసింగ్ బోర్డుని గట్టెక్కించడానికి తెరాస సర్కార్ ఒక ఉపాయం అమలు చేసింది. హౌసింగ్ బోర్డు చట్టానికి సవరణ చేసి అది 1956 నాటి నుంచి ప్రభుత్వంలో ఒక శాఖగానే గుర్తిస్తున్నట్లు మంత్రివర్గంలో ఒక తీర్మానం చేసి దానిపై ఆర్డినెన్స్ జారీ చేసి దానిని గవర్నర్ నరసింహన్ ఆమోదానికి పంపింది. ఇదంతా జరిగి సుమారు 4 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు దానిని గవర్నర్ ఆమోదించలేదు. అది ఆయన వద్దే ఉండిపోయింది. ఆయన దానిపై న్యాయ నిపుణులని సంప్రదించి వారి సలహా తీసుకొన్న తరువాత ఆ ఫైలుని ప్రభుత్వానికి వెనక్కి తిప్పి పంపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాలా చనువుగా, స్నేహంగా వ్యవహరించే గవర్నర్ నరసింహన్ ఈవిధంగా ఫైలుని వెనక్కి త్రిప్పి పంపుతారని బహుశః తెరాస సర్కార్ ఊహించి ఉండకపోవచ్చు. ఒక సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి అదనంగా ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఆదాయపన్ను శాఖకి వడ్డీతో సహా పన్ను చెల్లించవలసి రావడమే ఇబ్బంది అనుకొంటే మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ ని గవర్నర్ తిరస్కరించడం అవమానకరంగ మారింది. తద్వారా తెరాస సర్కార్ తీసుకొన్న నిర్ణయం తప్పు అని గవర్నర్ చెప్పినట్లయింది.
విశేషం ఏమిటంటే, సమైక్యరాష్ట్రంలో డా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అమ్మకాలపై ఈ పన్ను, వడ్డీ చెల్లించవలసి వస్తోంది. ఆస్తులలలో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది కనుక ఇటువంటి అప్పులలో కూడా జనాభా ప్రాతిపదికనే వాటాని స్వీకరించవలసి ఉంటుంది. అది మరొక సమస్య అని చెప్పవచ్చు. నోట్ల రద్దుతో తీవ్ర ఆర్ధికసమస్యలలో చిక్కుకొన్న తెరాస సర్కార్ మెడకి ఇప్పుడు ఈ సమస్య చచుట్టుకోవడం దురదృష్టమే. దీని నుంచి ఏవిధంగా బయటపడుతుందో చూడాలి.