ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు అక్కడ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, “నాకున్న సమాచారం ప్రకారం త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. అది జరిగిన తర్వాతే కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి విడుదలవుతారు. బీజేపీలో విలీనమైన తర్వాత కేసీఆర్ని తెలంగాణ గవర్నర్గా నియమించే అవకాశం ఉంది. అలాగే కేటీఆర్ని మోడీ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు హరీష్ రావు ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరుగుతాయని కేసీఆర్ చెప్పిన మాటలకు అర్దం ఇదే. త్వరలోనే నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోవడం ఖాయమే.
కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ రెండు మూడుసార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ వారం పదిరోజులు మకాం వేసి వస్తుండటంతో ఇటువంటిదేదో జరుగబోతోందని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాటిని తప్పు పట్టారు. మీడియాకు లీగల్ నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు కానీ బీజేపీలో బిఆర్ఎస్ విలీనం వార్తలని ఖండించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు ఇది ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ అనిపిస్తుంది లేదా నిప్పు లేనిదే పొగ రాదు కదా?అనే అనుమానం కూడా కలుగుతుంది.