భాజపా పోరాటం మద్యంపైనా లేక..

తెలంగాణా, ఆంధ్రాతో సహా దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై వచ్చే బారీ ఆదాయాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్దంగా లేవు. పైగా మద్యం విక్రయాలు ఇంకా గణనీయంగా పెరిగేందుకు మార్గాలు అన్వేషిస్తుంటాయి. తెరాస సర్కార్ కూడా అందుకు మినహాయింపు కాదు. రాష్ట్రంలో నీళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉందేమో కానీ మద్యానికి కరువు లేదు. అది ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీతో రాష్ట్రంలో మారుమూల గ్రామం నుంచి రాజధాని వరకు మద్యం ఏరులై పారుతోందని, దానితో అభంశుభం తెలియని విద్యార్ధులు, గ్రామీణులు కూడా మద్యానికి అలవాటు పడుతున్నారని రాష్ట్ర   భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ వాదిస్తున్నారు.

ఆ పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు మద్యంపై ప్రభుత్వ తీరుని నిరసిస్తూ నిన్న అబ్కారీ శాఖ కార్యాలయం ముందు ఒక్కరోజు దీక్ష చేశారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు  ఆయన దీక్షకి సంఘీభావం తెలిపారు. ఆ సందర్భంగా వారందరూ తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దశలవారిగా మద్య నిషేధం అమలుచేయాలని కోరారు. తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలని ప్రోత్సహిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస సర్కార్ మద్యం అమ్మకాలని పెంచుకొనే ప్రయత్నంలో వాటిని దెబ్బ తీస్తోందని డా.లక్ష్మణ్ ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే  రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని డా.లక్ష్మణ్ హెచ్చరించారు.

ఈ విషయంలో భాజపా పోరాటాన్ని తప్పకుండా మెచ్చుకోవలసిందే. కానీ తాము పూర్తిగా మద్య నిషేధం విదించాలని కోరుకోవడం లేదని దశలవారిగా మద్యనిసేధం విదించాలని కోరుకొంటున్నామని మళ్ళీ వారే చెప్పడం విశేషం. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయడం మొదలుపెట్టారు. దాని వలన రాష్ట్ర ప్రభుత్వం చాలా బారీగా ఆదాయం కోల్పోతున్నా...తన నిర్ణయాన్ని మద్యం తయారీ సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా...న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తింటున్నా కూడా ఆయన బిహార్ లో మద్యనిషేధం అమలు చేస్తున్నారు. అదీ చిత్తశుద్ధి అంటే!

తెరాస సర్కార్ ఆవిధంగా రాష్ట్రంలో మద్యనిషేధం విదించాలని భావించకపోవచ్చు కానీ దానిని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర భాజపా నేతలకైనా నితీష్ కుమార్ పాటి చిత్తశుద్ధి ఉందా? అంటే లేదనే అర్ధం అవుతోంది. మరి ఎందుకు పోరాడుతున్నారు? అంటే తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికేనని చెప్పక తప్పదు. కనుక వారి పోరాటం మద్యం మీద కాదు ఆ పేరుతో తెరాస సర్కార్ పైనే అని భావించవలసి ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యలని ఆయుధంగా చేసుకొని వారు తెరాస సర్కార్ ఏవిదంగా పోరాడుతున్నారో దీనినీ వారు ఒక ఆయుధంగానే భావిస్తూ తెరాస సర్కార్ పై ప్రయోగిస్తున్నట్లు చెప్పవచ్చు. కానీ తెరాస సర్కార్ ని నిలదీసే ముందు మద్యనిషేధంపై తమ పార్టీ వైఖరి ఏమిటో చెప్పి పోరాడితే బాగుంటుంది.