అవును..అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమట. అయితే ఆమెని ఓడించడానికి ఆయన కుట్రలు పన్నలేదు. మద్దతు తెలిపి ఓడించిపడేశారుట! ఆమెకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రవాసాంధ్రులకి లేఖలు కూడా వ్రాశారుట! ఆమె ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి చంద్రబాబు టికెట్ కూడా బుక్ చేసేసుకొన్నారుట!
ఆయన ఇంతగా ఆమెకి మద్దతు ఇస్తున్నప్పుడు, ఆయనే ఆమెని ఓడించారనడం ఏమిటి? అర్ధం లేకపోతేను..అని విసుకోవద్దు. దానికీ ఓ బలమైన కారణం ఉందిట! ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలని, వృద్ధులని, ప్రజలందరినీ మోసం చేస్తుండటం వలన ఆయనకీ వారందరి శాపాలు తగిలాయిట! కనుక ఆయన హిల్లరీ క్లింటన్ కి మద్దతు తెలుపగానే ఆ శాపాల ఎఫెక్ట్ ఆమెకి కొట్టేసిందిట! అందుకే ఆమె ఓడిపోయారుట! లేకుంటే ఆమె ఖచ్చితంగా గెలిచేవారుట! అంటే చంద్రబాబు నాయుడు తన శాపాలన్నిటినీ హిల్లారీ క్లింటన్ కి ట్రాన్స్ ఫర్ చేసేశారనుకోవాలేమో?
ఇదంతా విన్నాక ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఎవరికి వస్తాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే పార్టీ సిద్దాంతంగా మార్చేసుకొన్న వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి. నిన్న తిరుపతిలో మీడియాని పిలిచి ఈ రహస్యం బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు తను కోరుకొన్నవారిని ఇంత సులువుగా ఎక్కడినుంచో ఓడించేయగల శక్తి ఉండటం నిజమేనని వైకాపా నమ్ముతున్నట్లయితే ఆయన ఈసారి జగన్మోహన్ రెడ్డికే మద్దతు ప్రకటించేసే ప్రమాదం ఉంది. పనిలో పనిగా తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్, భాజపాలకి కూడా మద్దతు ప్రకటించేస్తే ఆటోమేటిక్ గా తెదేపా గెలిచేస్తుంది కదా!