ఏపికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేం వెంకయ్య నాయుడు చెపుతారు. ఏపికి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు చెపుతుంటారు. కానీ చంద్రబాబుకి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు. కానీ దాని కోసం పోరాటాలు చేయనవసరం లేదని చెపుతుంటారు. మరి ఏమీ చేయకుండా ఏపికి ప్రత్యేక హోదా ఏవిధంగా సాధించాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి.
ప్రత్యేక హోదా కోసం ఇదివరకు రెండు సభలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురంలో మరో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ నోట్లు రద్దు కారణంగా అది కూడా వాయిదా పడుతుందని అందరూ భావించారు కానీ యధాప్రకారం జరుగబోతోంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకి ఈ సభ మొదలవుతుంది. ఎప్పటిలాగే వేదికపై పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండి ప్రసంగిస్తారు. ఇదివరకు జరిగియన్ రెండు సభలలో ఆయన అభిమానులని అలరించడం తప్ప ప్రత్యేక హోదా సాధన కోసం ఎటువంటి కార్యాచరణ పధకాన్ని ప్రకటించలేదు. కనుక ఈరోజు సభలో ఆయన ఏమి చెప్పబోతున్నారో చూడాలి. బహుశః పెద్ద నోట్ల రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ, నల్లధనం అరికట్టడం దాని ప్రయోజనాలపై లెక్చర్ దంచుతారేమో?
కొన్ని రోజుల క్రితమే తెలంగాణాలో జనసేన పార్టీకి కార్యవర్గ సభ్యులని నియమించారు కనుక ఈరోజు బహిరంగ సభలో ఆంధ్రాలో పార్టీ నిర్మాణం కోసం ఏమైనా ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏమీ చేయకపోయినా కనీసం ఆ పని అయినా చక్కబెట్టుకొంటే ఇంతమంది పడిన కష్టానికి ఫలితం దక్కినట్లు అవుతుంది.