దేశంలో నల్లధనం అరికట్టేందుకు రూ.500, 1000 నోట్లని రద్దు చేయడంపై రాజకీయ నాయకులు స్పందించడం మొదలుపెట్టారు. అందరికంటే ముందుగా దాని కోసం చిరకాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ మోడీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఆ నిర్ణయం వలన దేశంలో సామాన్య ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. కనుక తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
మోడీని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అది అమానుష చర్య అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా మోడీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. తమ పార్టీ నల్లధనం బయటకి రప్పించాలనే కోరుకొంటోందని కానీ ఈవిధంగా హటాత్తుగా నిర్ణయం ప్రకటించడం సరికాదని అన్నారు. దీని వలన సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని అన్నారు.
ఒకవేళ కేంద్రప్రభుత్వం రూ.500, 1000 నోట్లని ఒక నెల రోజులు లేదా 3 నెలలు తరువాత రద్దుచేస్తున్నట్లు ప్రకటించి ఉండి ఉంటే ఏమైఉండేది? అని ఆలోచిస్తే, ఆలోగా దేశవిదేశాలలో నల్లధనం దాచుకొన్నవారు అందరూ తమ డబ్బుని ఏదో విధంగా తెల్లధనంగా మార్చుకొంటారు. కనుక నోట్లు రద్దు చేసినా ఆశించిన ప్రయోజనం దక్కదు. దేశవిదేశాలలో పేరుకుపోయిన ఆ నల్లధనాన్ని పనికిరాకుండా చేయాలంటే ఇదే సరైన మార్గం. అందుకే ఆకస్మికంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
దీని వలన సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు, అందరికీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కానీ అది తాత్కాలికమే. ఒక వారం పదిరోజుల్లోనే అంతా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కానీ వేలు,లక్షల కోట్లు నల్లధనం పోగేసుకొని కూర్చొన్నవారికే అసలైన దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ నుంచి వారుకోలుకోవడం చాలా కష్టమే. దేశం కోసం ప్రజలు కొన్ని రోజులు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్దపడుతుంటే, ఈ మూడు పార్టీల నేతలు కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
వారిలో అరవింద్ కేజ్రీవాల్ కేవలం మోడీని విమర్శించడానికి దీనిని ఒక అవకాశంగా భావించి విమర్శిస్తున్నారని భావించవచ్చు, నిరాడంబర జీవితం గడిపే మమతా బెనర్జీ సామాన్య ప్రజలకి ఎదురయ్యే ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొనే విమర్శించి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు. కనుక ఆ పార్టీలో డిల్లీ నుంచి గల్లీ వరకు చాలా మంది దగ్గర నల్లధనం పోగుపడి ఉండవచ్చు. కనుక తమకి నష్టం కలుగుతున్నందుకు మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారని భావించవలసి ఉంటుంది. ఏమైనప్పటికీ ఇది చాల సాహసోపేతమైన చర్య అనే చెప్పక తప్పదు. దీని సత్ఫలితాలు రానున్న రోజుల్లో కనిపించవచ్చు. కనుక దేశహితం కోరుకొనే వారందరూ ఈ తాత్కాలిక ఇబ్బందులని భరించడం అవసరమే. దేశభక్తి అంటే అదే!