ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

భారత్ ఆర్ధిక వ్యవస్థకి ముఖ్యంగా బారీగా నల్లధనం పోగేసుకొన్నవారికి ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు. నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో రూ.500, 1000 నోట్లు చెల్లవని, వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకొంటోందని ప్రకటించారు. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం దేశప్రజలని ఉద్దేశ్యించి చేసిన అత్యవసర ప్రసంగంలో ప్రకటించారు. దేశ ఆర్ధిక వ్యవస్థని చీడపురుగులాగ తొలిచేస్తున్న నల్లదనాన్ని, పొరుగుదేశాల నుంచి దేశంలోకి బారీగా తరలివస్తున్న నకిలీ కరెన్సీని అరికట్టడానికి, అవినీతిపరుల వద్ద ఉన్న ధనాన్ని బయటకి రప్పించేందుకు, ఉగ్రవాదులకి అందుతున్న ఆర్ధిక సహాయాన్ని నిలిపి వేసేందుకు ఈ కటినమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కనుక దేశాప్రజలందరూ ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరారు. 

కనుక బుధవారం నుంచి రూ.500, 1000 నోట్లు చెల్లుబాటు కావని చెప్పారు. కనుక వాటిని డిశంబర్ 30వ తేదీలోగా సమీపంలోని బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో జమా చేసి దానికి సరిపడా మొత్తాన్ని తిరిగి పొందవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మార్పిడి కోసం రేపు బారీగా ప్రజలు బ్యాంకులకి తరలివచ్చే అవకాశం ఉంది కనుక రేపు (బుదవారం) బ్యాంకులు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించకుండా రోజంతా కేవలం ఈ నోట్లు మార్పిడి కోసమే పని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. వీటి స్థానంలో కొత్త రూ.500, 2000 నోట్లు ప్రవేశపెడుతున్నట్లు మోడీ ప్రకటించారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు దేశంలో ఏ.టి.ఎం.లు పనిచేయవని ప్రకటించారు. డిశంబర్ 30వ తేదీలోగా ఈ నోట్లని జమ చేయలేనివారు తమ ఆధార్  లేదా గుర్తింపు కార్డులని చూపించి మార్చి 31వ తేదీలోగా బ్యాంకులలో జమా చేసుకొనే వెసులుబాటు కల్పించారు.   

ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, విమానాశ్రయాలు, శ్మశానాలు మొదలైన కొన్ని అత్యవసర సర్వీసులకి మరొక 72 గంటలు మినహాయింపు ఇస్తున్నట్లు మోడీ ప్రకటించారు. అక్కడ నవంబర్ 11వరకు ఈ రెండు నోట్లని స్వీకరిస్తారని తెలిపారు.

నవంబర్ 24వరకు పోస్టాఫీసులలో గరిష్టంగా రూ.4,000 వరకు నోట్లు మార్చుకోవచ్చు. బ్యాంకులలో అయితే రోజుకి రూ.10,000 వరకు మార్చుకోవచ్చు. కానీ పోస్టాఫీసులు, బ్యాంకులలో గల తమతమ ఖాతాలలో డబ్బు జామా చేసుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవు కనుక బారీగా నోట్లు మార్చుకోదలచినవారు, అది నల్లధనం కానతల్యితే నిర్భయంగా తమ ఖాతాలలో ఎంత డబ్బైనా జామా చేసుకోవచ్చు. అదే తేలిక, ఉత్తమం కూడా. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్-లైన్ ద్వారా చేసే చెల్లింపులకి కూడా ఎటువంటి పరిమితులు విధించలేదు.