బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దేశాన్ని కాపాడే సైనికులంటే అపారమైన గౌరవం కనబరుస్తుంటారు. సైనికులకి కోసం ఆయన ఎప్పుడూ అందరికంటే ముందుంటారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సరిహద్దుల వద్ద పాక్ సైనికులు కాల్పులలో నిత్యం ఒకరో ఇద్దరో భారత సైనికులు చనిపోతూనే ఉన్నారు. సరిహద్దుల వద్ద ప్రాణాలకి తెగించి పహారా కాస్తున్న భారత్ సైనికులకి సంఘీభావం తెలిపేందుకు అక్షయ్ కుమార్ మంగళవారం జమ్మూలోని సైనికులని వారి క్యాంప్ వద్ద కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ తాను సినిమాలలో మాత్రమే హీరోనని కానీ మీరు నిజజీవితంలో హీరోలని మెచ్చుకొన్నారు. దేశం కోసం పాక్ సైనికులు, ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన సైనికులకి నివాళులు అర్పించి, వారి కుటుంబాలకి రూ.9లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన తన మనసులో ఆలోచనని బయటపెట్టారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకి ఆర్ధిక సహాయం చేయడానికి దేశంలో చాలా మంది ప్రజలు ఆసక్తి చూపుతుంటారని, కానీ ఏవిధంగా చేయాలో తెలియక మిన్నకుండిపోతున్నారని, కనుక సైనికుల సహాయం చేయడం కోసం త్వరలో ఒక యాప్ రూపొందించాలనుకొంటున్నట్లు అక్షయ్ కుమార్ చెప్పారు.
అది చాలా మంచి ఆలోచనే. అక్షయ్ కుమార్ లేదా మరొకరో సైనికుల కుటుంబాలందరినీ ఆదుకోవడం అసాధ్యమే. కనుక ఈ ఉదార కార్యక్రమం కోసం ఒక యాప్ దానితో బాటు ఒక నిర్దిష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేయగలిగితే, దేశంలో కోట్లాది ప్రజలు తలో చెయ్యి వేయడానికి ముందుకు వస్తారు.
అక్షయ్ కుమార్ చెప్పిన ఈ ఆలోచననే తెలంగాణా రాష్ట్రంలో రైతన్నల కోసం, నిరుపేద విద్యార్ధుల కోసం, వృద్ధుల కోసం కూడా అమలుచేయవచ్చు. కనుక సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వారు అందరూ కాస్త దీని గురించి ఆలోచించి మంచి యాప్, వ్యవస్థని రూపొందించగలిగితే సంబంధిత వర్గాల ప్రజలకి ఎంతో మేలు చేకూరుతుంది కదా?