చెన్నైలో గేమ్ చేంజర్‌

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ చేంజర్‌ సినిమా మొదలుపెట్టి చాలా కాలమే అయ్యింది కానీ ఇంతవరకు షూటింగ్‌ పూర్తికాలేదు. దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2 కూడా చేస్తుండటం, ఇంకా మరికొన్ని ఇతర కారణాల వలన గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌కు చాలా సమయం తీసుకుంటున్నారు. 

ఇటీవల శంకర్ కుమార్తె వివాహం వలన మళ్ళీ గేమ్ చేంజర్‌కు గ్యాప్ వచ్చింది. ఆ కార్యక్రమం పూర్తి కాగానే శంకర్ వెంటనే గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌, సునీల్, నవీన్ చంద్ర తదితరులపై కొన్ని ముఖ్యసన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో ఆ షెడ్యూల్ పూర్తయింది. 

దీని తర్వాత షెడ్యూల్ మే 1వ తేదీ నుంచి చెన్నైలో మొదలుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్లో సినిమా చాలా వరకు పూర్తవుతుంది. ఈ సినిమాని సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కనుక ఇంక బ్రేక్ తీసుకోకుండా వీలైనంత త్వరగా గేమ్ చేంజర్‌ పూర్తి చేస్తానని దర్శకుడు శంకర్ మాట ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. 

క్రిందటి నెల 27వ తేదీన రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘జరగండి...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ గేమ్ చేంజర్‌ ఏ స్థాయిలో ఉండబోతోందో సూచించడంతో రామ్ చరణ్‌ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.  

గేమ్ చేంజర్‌ సినిమాలఓ రామ్ చరణ్‌కు హీరోయిన్లుగా కియరా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాస్ర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కాబోతోంది.