అధికారుల అత్యుత్సాహంతో పంటలు నీటి పాలు

మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో వేలాది చెరువుల పూడిక తీయడంతో ఇటీవల కురిసిన బారీ వర్షాలకి ఆ చెరువులన్నీ నిండాయి. దానితో పరిసర ప్రాంతాలలో పంటలకి అవసరమైన నీటి సదుపాయం ఏర్పడటమే కాక భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయి. అందుకు రైతులు చాలా సంతోషిస్తున్నారు. నాణానికి రెండోవైపు చూస్తే ఒక విచిత్రమైన సమస్య కనిపిస్తుంది. 

గద్వాల్ జిల్లాలోని థరూర్ మండలంలోని గూడెందొడ్డి రిజర్వాయరుని 1.04 టి.ఎం.సి.లు నీళ్ళు నిలువచేసే సామర్ధ్యంతో నిర్మించారు. ఇటీవల సాగునీటి శాఖ అధికారులు దాని పూర్తిస్థాయిలో నీటిని నిలువ చేసేందుకు నీళ్ళని రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు. కానీ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంత బారీ స్థాయిలో నీటిని విడుదల చేసేసరికి రిజర్వాయర్ పక్కనే గల కొత్తపాలెం, డోర్నాల గ్రామాలలో మిర్చి, ప్రత్తి, వరి పంటలన్నీ నీట మునిగిపోయాయి. దానితో వందలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది.

ఆ గ్రామాలకి చెందిన 50 మంది రైతులు తమకి జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించవలసిందిగా కోరుతూ  హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్ పై నిన్న విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్.వి.భట్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే పంట నష్టం జరిగింది కనుక తప్పనిసరిగా రైతులకి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. రైతులకి ఎంత నష్టపరిహారం చెల్లించబోతున్నారో రేపటిలోగా లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించకపోయినట్లయితే వారి జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పంటలకి నీళ్ళు అందిస్తుంటే, అధికారులు అత్యుత్సాహం కారణంగా ఇక్కడ పంటలు నీట మునిగాయి. దీనిలో ప్రభుత్వం తప్పేమీ లేదని తెలుస్తూనే ఉంది. రిజర్వాయర్ ని నింపేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రయంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం వలననే ఈ సమస్య ఎదురైంది. ఇకనైనా ఇటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటే చాలా మంచిది.