కనీసం హఫీజ్ ఒప్పుకొన్నాడు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ ని పాక్ అంగీకరించకపోయినప్పటికీ, ఆ దేశంలో స్వేచ్చగా తిరుగుతున్న హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ అంగీకరించాదం విశేషం. అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మిర్ పూర్ లో ఆదివారం ఒక బారీ బహిరంగ సభ నిర్వహించాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, “భారత ప్రధాని మోడీ వంతు అయింది. ఇప్పుడు మా వంతు. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ కంటే చాలా భయానకమైన దాడులు మేము త్వరలోనే భారత్ లో నిర్వహించబోతున్నాము. దానిని భారతదేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. అంత భయానకంగా ఉంటాయి మా దాడులు. అవి చూసిన తరువాత భారత్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఇక ఎవరూ చెప్పుకోరు,” అని హెచ్చరించాడు. 

అతని చేసిన హెచ్చరికలలో భారత్ ఆర్మీ పాక్ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని స్పష్టం అయ్యింది. ఆ విషయం పాక్ పాలకులకి, సైన్యాధికారులకి కూడా తెలుసు కానీ ఆవిషయం ఒప్పుకొంటే ప్రజలు, ప్రతిపక్షాల ముందు సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుందనే భయంతో సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని వాదిస్తున్నట్లు భావించవచ్చు. వారు అంగీకరించకపోయినా సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన మాట వాస్తవం కనుకనే ఆ రోజు నుంచి పాక్ సైనికులు, ఉగ్రవాదులు భారత్ సరిహద్దు గ్రామాలపై నిరంతరం దాడులకి పాల్పడుతున్నారు. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కోసం అంటూ అమెరికా నుంచి ఏటా కోట్లాది డాలర్లు వసూలు చేసుకొంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తన గడ్డపై హఫీజ్ సయీద్ స్వేచ్చగా తిరగడానికి అనుమతించడమే కాకుండా తన గడ్డపై నిలబడి భారత్ పై ఉగ్రవాద దాడులు చేస్తామని చెపుతుంటే ఏమీ చేయడం లేదు. అతను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కే హెచ్చరికలు జారీ చేసే స్థాయికి ఎదిగాడంటే పాక్ ప్రభుత్వంలో డొల్లతనం అర్ధం అవుతోంది. ఒక ఉగ్రవాది పాకిస్తాన్ లో అంత శక్తివంతుగా మారడం చాలా విచిత్రంగా ఉంది. కానీ అతనికంటే చాలా శక్తివంతుడైన బిన్ లాడెన్ కి చివరికి ఎ గతి పట్టిందో అందరూ చూశారు. బహుశః హఫీజ్ సయీద్ కూడా అదే గతి పట్టవచ్చు.

భారత్ పై దాడులు చేస్తామని అతను పదేపదే చేస్తున్న హెచ్చరికలని భారత ప్రభుత్వం తేలికగా తీసుకోవడానికి లేదు. అతను ఈసారి ఏదో చాలా పెద్ద ఆలోచనే చేస్తున్నట్లు ఉన్నాడు. అందుకే భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ కంటే చాలా భయానకమైన దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు భావించి, తదనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.