రాహుల్ గాంధీకి లైన్ క్లియర్!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇన్నాళ్ళకి లైన్ క్లియర్ అయ్యింది. పెళ్ళికా..పార్టీ అధ్యక్ష పదవుకా అంటే రెండో దానికే. తెలుగు సినిమా హీరోయిన్లలాగే ఆయన పెళ్ళికీ ఇంకా చాలా టైం ఉంది. ఇవ్వాళ్ళ డిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యూ.సి.) సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కనుక ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోనే సి.డబ్ల్యూ.సి. సమావేశం జరిగింది. దానిలో మాజీ కేంద్రమంత్రి సీనియర్ నేత ఎకె అంథోని రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రతిపాదించగా సమావేశంలో పాల్గొన్న నేతలు అందరూ ఆయనకి మద్దతు ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది జూన్-జూలై నెలల మద్య పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. కనుక అంతవరకు సోనియాగాంధీ యే పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతారు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ని నిర్దేశించే ఇటువంటి కీలకమైన సమావేశం సోనియాగాంధీ లేకుండా జరుపడం చాలా విచిత్రంగానే ఉంది. ఆమె తన ముద్దుల కొడుకుని ప్రధానమంత్రిని చేయాలని చాలా ఆశపడ్డారు. కానీ వీలుపడలేదు. కనీసం పార్టీ అధ్యక్ష కుర్చీలోనైనా కూర్చోవాలని రాహుల్ గాంధీ తహతహలాడారు. కానీ అదీ ఇంతవరకు సాధ్యం కాలేదు. చివరికి హటాత్తుగా ఇవ్వాళ్ళ ఆయనకి ఆ భాగ్యం కల్పించేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఇదివరకు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోమన్నప్పుడు రాహుల్ గాంధీ మీనమేషాలు లెక్కించడం వలన దానిలో నరేంద్ర మోడీ సెటిల్ అయిపోయారు. కనుక మళ్ళీ పార్టీ సీనియర్ నేతలలో ఎవరో ఒకరు మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి సందేహం వ్యక్తం చేయకముందే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పట్టాభిషేకం చేసేసుకోవడం మంచిది.