ఏపికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న వైజాగులో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన ఒక ఆసక్తికరమైన మాట కూడా చెప్పారు.
“ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి భయపడం. ఉద్యమాలంటే వెరుపు లేదు. జైళ్ళంటే భయం లేదు. ప్రాణాలు పోతాయన్న బాదే లేదు. ఏపికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటాలు సాగిస్తూనే ఉందాం. అవసరమైతే మన ఏమ్పిల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు వచ్చేలాగ చేసి మన సమస్యని దేశ ప్రజలు అందరూ గుర్తించేలా చేద్దాం. వచ్చే ఎన్నికలని ప్రత్యేక హోదాపై రిఫరెండంగా జరిగేలా చేసి, జాతీయ పార్టీలకి బుద్ధి చెపుదాం,” అని అన్నారు. ఏపి సిఎం చంద్రబాబుపై ఆయన నిత్యం చేసే విమర్శల క్యాసెట్ కూడా మళ్ళీ ఆ సభలో కూడా యధాప్రకారం వినిపించారు. అవన్నీ అప్రస్తుత విషయాలు. ఎంపిల రాజీనామాల విషయం కూడా పాతదే కానీ జైలుకి వెళ్ళడానికి భయపడం.. రిఫరెండం అనే రెండు పాయింట్లే కొత్తగా వినిపించాయి.
జగన్ పై సిబిఐ, ఈడి కేసులు వేర్వేరు దశలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ కేసులలో మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకశం ఉందని జగన్ భావిస్తున్నట్లున్నారు. బహుశః ఆ భయంతోనే జగన్ ప్రత్యేక హోదా పేరుతో జోరుగా ఉద్యమాలు సాగించాలనుకొంటున్నరేమో కూడా? ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తనపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడతాయని, అవి తనని అవినీతి కేసుల సాకుతో మళ్ళీ జైలుకి పంపే అవకాశం ఉందని గ్రహించబట్టే ముందు జాగ్రత్త చర్యగా ఆ మాట అని ఉండవచ్చు. ప్రత్యేక హోదా కోసం జోరుగా ఉద్యమాలు సాగిస్తున్నప్పుడు అవినీతి ఆరోపణల కేసులలో కూడా అరెస్ట్ చేసినా రాజకీయ కక్ష సాధింపుగా చెప్పుకొనే అవకాశం ఉంటుంది కనుక కేంద్రప్రభుత్వం కూడా అందుకు వెనుకాడవచ్చునని జగన్ భావిస్తున్నారేమో?
ఇక ప్రత్యేక హోదా అంశాన్ని వచ్చే ఎన్నికలలో ‘రిఫరెండం’గా మార్చుతానని జగన్ చెపుతున్నారు కనుక బహుశః అందుకే అంతవరకూ ఆ వేడిని నిలిపి ఉంచేందుకు యువభేరీలు వగైరా మ్రోగించాలనుకొంటున్నారేమో. కానీ గత ఎన్నికలలో చంద్రబాబు వేసిన వ్యూహాలకి చిత్తయిన జగన్, వచ్చే ఎన్నికలలోనయినా ఈ ఐడియాతో విజయం సాధిస్తారా? ఏపి రాష్ట్ర ప్రజలు జగన్ భేరీలని పట్టించుకొంటారా? అనేది 2019ఎన్నికల తరువాతే తెలుస్తుంది. అంతవరకు చంద్రబాబు, జగన్ ప్రజలతో ఎన్ని గేమ్స్ ఆడుకొన్నా భరిస్తారు.