సింగరేణి సంస్థ ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకొంది. కార్మికుల కుటుంబ సభ్యులకి వారసత్వంగా ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం సింగరేణి కార్మికులు గత 15సం.లుగా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వారి కోరికని మన్నించి సింగరేణి సంస్థకు ఆదేశాలు జారీ చేయడంతో ఇది సాధ్యపడింది.
సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులలో ఈ ఏడాది అక్టోబర్ 11నాటికి 48 నుంచి 58 ఏళ్ళ వయసు గలవారు తమ ఉద్యోగాలని తమ పిల్లలకి బదిలీ చేసుకోవచ్చు. వారి కుమారుడు లేదా సోదరుడు లేదా అల్లుడు ఈ ఉద్యోగాలు పొందడానికి అర్హులుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకొనేందుకు వారసులు 18 నుంచి 35 ఏళ్ళు మద్య వయసు కలిగి ఉండాలి.
సాధారణంగా బొగ్గుగనులలో పనిచేసే కార్మికులు కాలుష్యం వలన, ఆక్సిజన్ లోపం వలన కొంత కాలానికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. కానీ వారి కుటుంబాలు ఆ ఉద్యోగాలపైనే ఆధారపడి జీవిస్తున్నందున, వారు ఎంత అనారోగ్యంగా ఉన్నా చాలా కటిన పరిస్థితులతో కూడిన ఆ ఉద్యోగం చేయక తప్పనిసరి అవుతోంది. ఇప్పుడు వారు తమ ఉద్యోగాలని తమ వారసులకి అప్పగించి విశ్రాంతి తీసుకొనే అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ మానవత్వంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం. దీని వలన వందలాది కార్మికులకి చాలా ఉపశమనం కలుగుతుంది.