ఇటీవల పడిన బారీ వర్షాలకి హైదరాబాద్ లో రోడ్లు చెరువులుగా మారడంతో తెరాస సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటి నుంచి నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై తెరాస సర్కార్ కటిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ కాంట్రాక్టర్ల తీరు ఏమాత్రం మారలేదని ఈరోజు ఉప్పల్ హిల్స్ లో జరిగిన సంఘటన నిరూపించింది.
రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రజలందరికీ మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఉప్పల్ ప్రాంతంలో మంచినీటి పైప్ లైన్స్ ఏర్పాటు చేయిస్తోంది. దానిని రవాణాశాఖా మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్ కలిసి ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. వారు ఆ కార్యక్రమం ముగించుకొని తమ కార్లు వైపు నడుస్తుండగానే ఆ పైప్ లైన్ పగిలిపోగి దానిలో నుంచి నీళ్ళు ఫౌంటెన్ లాగ పైకి చిమ్మడం మొదలైంది. బిజెవైఎం కార్యకర్తలు ఆ విషయం వారికి తెలిపేందుకు వెళ్ళగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు.
పైప్ లైన్ లీక్ అవుతోందని వారు చెప్పినప్పుడైనా కనీసం మంత్రిగారు, ఎంపి, ఎమ్మెల్యేలు మళ్ళీ ఓసారి వెనక్కి వచ్చి దానిని పరిశీలించి, కాంట్రాక్టర్ ని పిలిపించి మందలించి ఉండి ఉంటే బాగుండేది. కనీసం ఓసారి వెనక్కి వచ్చి చూసివెళ్ళినా బాగుండేది. కానీ వారు తమ వాహనాలలో వెళ్ళిపోయారు. వారి తీరు చూసి అక్కడే ఉన్న మహిళలు బుగ్గన వేలేసుకొన్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్లు వేస్తే నెలరోజులకే పాడైపోతున్నాయని అందరూ నవ్వుకొంటుంటే, ఉప్పల్ పైప్ లైన్ 5 నిమిషాలకే పగిలిపోయిందని బుగ్గలు నొక్కుకొంటున్నారు. మరి మంత్రులు, కాంట్రాక్టర్ ఏమంటారో?