వాళ్ళిద్దరూ ఎవరో కాదు ఏపి, తెలంగాణా సిఎంలు. ఈరోజు గవర్నర్ నరసింహన్ పుట్టినరోజు సందర్భంగా ఉప్పునిప్పులాగా ఉండే వాళ్ళిద్దరూ రాజ్ భవన్ లో కలుసుకోబోతున్నారు. ఆ సందర్భంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న సచివాలయ భవనాల అప్పగింత, షెడ్యూల్: 10లో ఆస్తుల విభజన గురించి మాట్లాడుకొనే అవకాశం ఉంది.
ఈ వ్యవహారాలలో వాళ్ళిద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు గవర్నర్ నరసింహన్ స్వయంగా చొరవ తీసుకొని కృషి చేస్తున్నారు కనుక, ఈరోజు తన పుట్టినరోజు బహుమతిగా ఇద్దరినీ ఈ సమస్యల పరిష్కారానికి అంగీకరించమని కోరితే వారు కాదనలేరు. షెడ్యూల్: 10లో ఆస్తుల పంపకాలపై రెండు రాష్ట్రాల మద్య ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగానే హైకోర్టు విభజన కూడా జరుగడం లేదు కనుక ఒకవేళ ఈరోజు వారి సమావేశంలో ఆ సమస్యని పరిష్కరించినట్లయితే హైకోర్టు విభజన కూడా సాధ్యపడవచ్చు. ఇరువురు ముఖ్యమంత్రులు మంచి రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత ఉన్నవారే కనుక ఈ సమస్యల పరిష్కారం కోసం వారు కాస్త పట్టువిడుపులకి సిద్దపడితే, రెండు రాష్ట్రాలకి కూడా చాలా మేలు కలుగుతుంది. ఈ నేపధ్యంలో ఈరోజు జరుగుతున్న వారి భేటీ చాలా కీలకమైందనే చెప్పవచ్చు.