ఆంధ్రా-ఓడిశా సరిహద్దు (ఏఓబి)లో మావోల ఎన్కౌంటర్ తరువాత కనిపించకుండాపోయిన వారి అగ్రనేత రామకృష్ణ క్షేమంగా ఉన్నట్లు తమకి సమాచారం అందిందని విరసం నేత వరవరరావు నిన్న మీడియాకి తెలియజేశారు. ఇన్ని రోజులుగా ఆయన ఆచూకి తెలియక తాము చాలా ఆందోళన చెందామని, ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలిసింది కనుక ఆయన ఆచూకీ తెలపాలంటూ తాము హైకోర్టులో వేసిన పిటిషన్ని ఉపసంహరించుకొంటామని చెప్పారు. ఏఓబిలో ఆంధ్రా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్స్ తక్షణమే నిలిపివేయాలని, మావోల ఆచూకి కోసం గిరిజనులని వేధించడం మానుకోవాలని ఆయన ఏపి సర్కార్ ని డిమాండ్ చేశారు.
ఇన్ని రోజులుగా రామకృష్ణ ఏపి పోలీసుల అధీనంలోనే ఉన్నాడని, వారి వలన అతని ప్రాణాలకి ప్రమాదం ఉందని వాదిస్తూ హైకోర్టులో ఆయన భార్య చేత ఒక పిటిషన్ కూడా వేయించిన వరవరరావు, అతను తమ అధీనంలో లేడని పోలీసులు హైకోర్టుకి చెప్పగానే వెంటనే ఈవిధంగా ప్రకటించడం చాలా అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఆయన ప్రకటనపై ఏపిడిజిపి సాంభశివరావు స్పందిస్తూ, “గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టులు మాతో ఇటువంటి మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. రామకృష్ణ విషయంలోని వారు అలాగే ప్రవర్తించారు. అతను మావద్ద లేడని మేము చెపుతున్నప్పటికీ, మా వద్దే ఉన్నడంటూ తమకి పక్కా సమాచారం ఉందంటూ వాదించారు. కానీ ఇప్పుడు అతను క్షేమంగా ఉన్నట్లు తమకి సమాచారం అందిందని చెపుతున్నారు. మావోల వ్యహరాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకు వెళతాము,” అని చెప్పారు.
నిన్నటి వరకు రామకృష్ణ పోలీసుల అధీనంలోనే ఉన్నడంటూ గట్టిగా వాదించిన వరవరరావు, హటాత్తుగా మాట మార్చి అతను క్షేమంగా ఉన్నట్లు ఎందుకు ప్రకటించారు? అనే సందేహం కలుగుతుంది.
అతను పోలీసుల కస్టడీలో లేడని హైకోర్టు ద్వారా దృవీకరించుకొన్న తరువాత కూడా ఇంకా అతని ఆచూకీ తెలియదని చెప్పుకొంటున్నట్లయితే, అతను చనిపోయి ఉండవచ్చనే అభిప్రాయం బలపడుతుంది. ఎన్కౌంటర్ కారణంగా ఇప్పటికే చాలా బలహీనపడిన మావోలని, వారి మద్దతుదారులని ఇంకా బలహీనపరిచినట్లు అవుతుంది. అది పోలీసులకి ఇంకా ఉత్సాహం కలిగించవచ్చు. బహుశః అందుకే రామకృష్ణ క్షేమంగా ఉన్నట్లు తమకి సమాచారం అందినట్లు వరవరరావు ప్రకటించి ఉండవచ్చు. కానీ రామకృష్ణ బ్రతికే ఉన్నడా లేడా అనే విషయం ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెపితే తప్ప నమ్మలేము. ఒకవేళ ఆయన ఆ పని చేయకపోతే ఆయన ఆచూకీ దొరకనట్లుగానే భావించవలసి ఉంటుంది.
అయినా రామకృష్ణ క్షేమంగా ఉన్నట్లు తమకి సమాచారం అందిందని వరవరరావు ప్రకటించారు కనుక పోలీసులు ఆయనని ప్రశ్నించి రామకృష్ణ ఆచూకిని తెలుసుకొంటే, అతని కోసం వారు అడవులలో వెతుకుతూ శ్రమపడనవసరం ఉండదు కదా!