కెసిఆర్ దానికే ఫిక్స్ అయ్యారుట!

ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో 10 అంతస్తులతో కూడిన కొత్త సచివాలయ భవనం నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించడం, కాంగ్రెస్ నేతలు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయాన్ని కూల్చివేయరాదని కోర్టు స్టే విదించడం అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కొత్త సచివాలయ భవనం నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నవంబర్ 14న కొత్త సచివాలయ భవనం నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ముందు శంఖుస్థాపన కార్యక్రమం చేసుకొని, వివాదాలన్నీ పరిష్కరించుకొన్న తరువాత సచివాలయ భవనాలని కూల్చివేసి, నిర్మాణపనులు మొదలుపెట్టాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సచివాలయంలో నుంచి ప్రభుత్వ కార్యాలయాలని వేరే చోటికి తరలించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మళ్ళీ మాట్లాడి దాని అధీనంలో ఉన్న భవనాలని కూడా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకపోవచ్చునని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త సచివాలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. 

సచివాలయం కూల్చరాదని హైకోర్టు స్టే విధించినప్పుడు ముఖ్యమంత్రి కొత్త సచివాలయం నిర్మాణం కోసం శంఖుస్థాపన చేస్తే దానిని కోర్టు ధిక్కారంగానే హైకోర్టు భావించినట్లయితే ఈ సమస్య ఇంకా జటిలం కావచ్చు. షెడ్యూల్: 10లో ఆస్తుల విభజనకి అంగీకరిస్తే గానీ తన అధీనంలో ఉన్న భవనాలని తెరాస సర్కార్ కి అప్పగించబోమని ఏపి సర్కార్ మెలిక పెట్టింది. హైకోర్టు తీర్పు ఏవిధంగా ఉండబోతున్నప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు సచివాలయం కూల్చివేతని అడ్డుకొంటామని గట్టిగా చెపుతున్నాయి. కనుక తెరాస సర్కార్ ముందుగా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకొంటే గానీ సచివాలయం కూల్చివేత, కొత్త భవనం నిర్మాణ పనులు మొదలుపెట్టడం సాధ్యం కాదు. 

లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ముఖ్యమంత్రి కొత్త సచివాలయం కట్టుకోవాలనే ఆలోచన కలుగగానే ఇన్ని సమస్యలున్నాయని తెలిసి ఉన్నప్పటికీ హడావుడిగా సచివాలయం ఖాళీ చేసేసి కొత్త భవనానికి శంఖుస్థాపన చేసేసుకొన్నాక ఏ కారణం చేతైన ముందుకు వెళ్ళలేకపోతే అది తెరాస సర్కార్ కి చాలా అప్రదిష్ట కలిగిస్తుంది. కనుక తెరాస సర్కార్ ఈవిషయంలో బాగా ఆలోచించుకొని ముందడుగు వేయడం మంచిది.