మంత్రి మల్లారెడ్డి పదవి, అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు సాగేది. కానీ అవి పోగానే ఆయనపై షామీర్ పేట పోలీస్ స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది.
సికింద్రాబాద్ సమీపంలోని మూడు చితలపల్లి కేశవరంలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి మరికొందరు బినామీలతో కలిసి కబ్జా చేశారని కేసు నమోదైంది. అయితే దానితో తనకు ఎటువంటి సంబందమూ లేదని, కనుక ఆ కేసు నుంచి తన పేరుని తొలగించాలని కోరుతూ ఆయన ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేశారు. కేవలం రాజకీయ కక్షతోనే కొందరు తన పేరుని ఈ కేసులో చేర్చారని మల్లారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
మల్లారెడ్డితో పాటు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడో రేపో విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది కనుక ఆయన హడావుడిగా హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.